ప్రేమ లేఖ..!
నేస్తమా !
"కళ్ళు వెళ్ళే ప్రతి చోటికి మనస్సు,
మనస్సు వెళ్ళే చోటికి మనిషి",
వెళ్ళ కూడదు అంటారు.కాని,నిన్ను చూసిన క్షణాన నా కళ్ళు మనస్సుతో ఏకీభవించి నిన్ను చేరాయి.
ఇప్పటి అమ్మాయిలకు జీన్స్,స్కర్ట్స్,మినిస్ ఫ్యాషన్ అనుకున్నాను.కాని,గుడిలో నిన్ను చూసినప్పుడు తెలిసింది అమ్మాయికి ఓణి,చీర అందం అని.స్పందించటానికి హృదయం కావాలి అని నిన్ను చూసినప్పుడు అనిపించింది.దేవుని పొటోలు తీసుకోవడానికి వచ్చిన నాకు ఓణిలో ఉన్నఅందాన్ని చూసాను.అప్పుడు నా కళ్ళు ఫ్లాష్ కొట్టగా నీఫోటో నా మనసులో చెరగని ముద్ర వేసింది.గుడిలో ఫోటోలు తీస్తున్నావు నీవు ఎవరు? అని నీ ఓర చూపు నన్ను నిలదిశాయి."హారతి ఇస్తున్నారు వెళ్ళండి" అన్న నీ పలుకులు నన్ను ఆశ్చర్య,ఆనందాలతో ముంచింది.అప్పుడు నీ పలకరింపు నా హృదయానికి స్పందన నేర్పింది.ఆ స్పందన ప్రతి రాత్రి వెన్నెల రేరాజు రాక కోసం తపిస్తున్న కలువలా అనిపించింది.ప్రదక్షణలు చేస్తుంటే తనను అందుకోలేవేమో కాని ననైన్న అందుకో అన్నట్లు కురులలోని విరజాజి జారి నా ముందు పడింది.ప్రేమలో పడ్డ నాకు విరజాజి కూడా నాతో మాట్లాడిందే అనిపించి దాన్ని అందుకున్నాను.
నీ చిరు నవ్వులకు ఆ దివిలో పారిజాత పుష్పాలు వికసిస్తాయేమో అనుకున్నాను.నువ్వు దాటే ప్రతి సారి వీచే చల్లగాలికి నీ కురులు నన్ను పలకరించేవి.తనని చూసి నన్ను నీ దరికి చేరనియట్లేదు అని "నిద్ర" నన్ను నిందిస్తుంది.అలా,తను నా పై ఎన్ని సార్లు నిందించి అలిగి వెళ్లిందో "నిద్రకు నాకే తెలుసు".
సముద్రపు ఒడ్డున గవ్వల పడివున్న నాకు నీ స్నేహం తోడైతే ముత్యపు చిప్పనౌతాను."ప్రియా" అనీ మనసారా పిలవాలని ఉన్న నా సంస్కారం అడ్డువచ్చి,తన సమాధానం తెలుసుకొని పిలువు అన్నది.అందుకే, "నేస్తమా" అని సంభోదించాను.నీ ప్రేమ కోసం నా మనస్సు నిరిక్షిస్తుంది.ఈ నిరీక్షణ నా సహనాన్ని ధహించివేస్తున్న అది కూడా నాకు ఓర్పును నేర్పింది.నీలి మేఘాల కోసం నెమలి ఎదురు చూసినట్లు ప్రతి రోజు నీ రాక కోసం గుడి దగ్గర ఎదురు చూస్తున్నాను.
నీ మౌనం నా మనోనిబ్భరాన్ని ప్రతి క్షణం పరీక్షిస్తుంది.గడ్డి పరకలో అమృతం ఉంటుందనీ విన్నాను.అది నిజమో కాదో తెలియదు కాని నీ ప్రతి పలకరింపులో నాకు అమృతం ఒలికి పోతుందనిపిస్తుంది."ప్రేమ వికసిస్తుందే కాని నశించదు" అనే నమ్మకాన్ని నా ప్రేమకు పునాదిగా వేసుకున్నాను.నువ్వు ప్రేమిస్తున్నాను అంటే నీలి మేఘాలకు పురివిప్పే నెమలిని నేనేనౌత.ప్రేమించట్లేదు అనేది నీ సమాధానమైతే నేను శిలను కానందుకు చింతిస్తాను.
ఈశ్వరుని ముందుండే నంది లాంటి నాకు ఇన్ని స్పందనలు ఉన్నాయని చెప్పకుండానే తెలియజేశావు.ఏది ఏమైనా ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఏకమైతే వచ్చే స్వచ్చమైన తెలుపు వంటి నీ స్నేహానైనా నాకు అందిస్తావని....
ఇట్లు
ఏమి కానినేను,
నీకు ఎమౌగలనో తెలియని...
- అను మిట్టసల.
No comments:
Post a Comment